Monday, 20 February 2017

International Mother Language Day - 21st February

అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఏడుపు ఏ భాష పలుకుతుంది? ఇప్పుడిప్పుడే మాటలు నేర్చిన చిన్నారి ఏ భాషను గ్రహిస్తుంది? ప్రతి మనిషి పుట్టేక పలికె మొదటి పలుకు తన తల్లిని పిలవడానికి తన మాతృభాషలో "అమ్మా" అని అనడం. అది ఏ భాష అయినా సరే దాని వెనుక భావం మాత్రం ఒక్కటే. 
నేడు ప్రపంచమంతా ఎక్కువగ వాడే భాష ఆంగ్లము. చదువు, ఉద్యోగం, వ్యాపారం, తదితర రంగాలు నేడు ఆంగ్లభాషకే ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. దానికి కారణం, నేడు మనం చూస్తున్న ప్రపంచీకరణ. ప్రతి రంగంలోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందరూ సమానంగా పోటీ పడుతున్న ఈ కాలంలో, ప్రతి ఒక్కరు అందరికి అర్ధమయ్యే భాషలో సంభాషిచగలడం అనివార్యం అయ్యింది. ఏ భాషలో మాట్లాడినా భావవ్యక్తీకరణ వద్దకు వచ్చేసరికి మన మాతృభాషలో మన భావాలను వ్యక్తం చేసిన విధంగా మారే భాషలోనూ చేయలేము. ఆనందం వచ్చినా, దుక్ఖం వచ్చినా, నొప్పీలో ఉన్నా, మన మనసులో భావాలను మన మాతృభాషలోనే వ్యక్తం చేసుకుంటాం ఎందుకంటే, ఉగ్గుపాలతో కలిపి మన తల్లి మనకు పట్టిన ఆ భాష మన నరనరాలలో ప్రవహిస్తుంది, మన గుండెకు అతి చేరువగా ఉంటుంది కనుక.

ప్రపంచం అతి వేగంగా ముందుకు నడుస్తోంది. ప్రతీ రంగంలోనూ దేశాలు తమ ప్రతిభను చాటుకోవడానికి ఎంతో శ్రమపడుతున్నాయి. ఈ ప్రక్రియలో వారు తమ జాతీయ, మాతృభాషలపై  దృష్టిసారించటం లేదు. కొన్ని దేశాలలో ప్రజలు తమ కార్యాలయాలలో గాని పాఠశాలలో గాని వారి మాతృభాషలో సంభాషించుకోవటం నిషేదించబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడటం వలన ప్రపంచమంతటా వివిధ భాషాపరిగ్యానముపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం కలిగింది. ఈ అంశంపై చర్చించి ఒక పరిష్కారం తేవాలన్న ఉద్దేశంతో మరియు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజ్యాలలో మరుగున పడుతున్న భాషల పునరోధారణకొఱకై 1999లో యునెస్కో "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం" జరుపుకువోలన్న ప్రతిపాదనను తెలిపింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ,  2008లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 21న "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం" జరపాలని ప్రకటించింది. 

ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా, మనం ఏ భాషలో మాట్లాడుకున్న, చదువుకున్న, మన మాతృభాషకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, గౌరవం, ఇవ్వాల్సినదే. అది మన ధర్మం, మన సంస్కారం మరియు భాద్యత. తెలుగువారమైన మనం, ప్రపంచంలో ఏ మూలలో ఉన్న, ఏ విదేశంలో జీవిస్తున్న, మన మాతృభాషైన తెలుగు భాషను ఎన్నడూ మరచిపోకూడదు, మరుగుపడనివ్వకూదదు. మన పిల్లలకు, మనుమలకు, మన భాష గొప్పదనాన్ని, మరియు ప్రాముఖ్యతను తెలిపి, మన భాష అంతరించిపోకుండా, వారిచేత ముందుకు తీసుకువెళ్లాలి. 

"ఏ దేశమేగినా ఎందు కాలిడినా , ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని , నిలుపరా నీ జాతి నిండు గౌరవము"  అని రాయప్రోలు సుబ్బారావు గారు పలికిన ఆణిముత్యాలను గ్యప్తికి తెచ్చుకొంటూ మన తెలుగుదేశ భాషను, సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడుతూ అందరూ అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.