బయట ఎవరో గేట్ ఓపెన్ చేస్తున్న చప్పుడు విని ఎవరు వచ్చారో చూద్దామని తలుపు తీశారు జయశ్రీ. suitcase తోసుకుంటూ లోపలకి వచ్చిన తన కూతురు అక్షరని చూసి ఆశ్చర్యపోయారు.
"అదేంటే, నిన్న రాత్రే కదా మాట్లాడాను, అప్పుడు కూడా ఏం చెప్పలేదు బెంగుళూరు నుండి వస్తున్నట్టు?"
"ముందే చెప్పేస్తే సర్ప్రైస్ ఎలా ఇచ్చేది? " అని అన్నాది చేతిలో ఒక గిఫ్ట్ పెట్టి.
"ఇదేంటి ?"
"ఓపెన్ చేసి చూడమ్మా"
కూతురి హడావిడి చూసి గబగబా ఆ గిఫ్ట్ కవర్ని విప్పి చూసారు జయశ్రీ.
బాక్స్ తెరిచి చూస్తే లోపల ధగ ధగా మెరుస్తూ కనిపించాయి వజ్రాల దుద్దులు.
"అమ్మో , ఏంటమ్మా ఇవి ? ఎందుకమ్మా ఎప్పుడు ఇవి కొన్నావు? చాలా ఖరీదుంటాయేమో?" అని కంగారుగా అడిగారు.
"ఏంటమ్మా నువ్వు? ప్రేమగా డైమండ్ ఇయర్ రింగ్స్ కొని తెస్తే ఎందుకు ? ఏమిటి ? ఎలా ? అని ప్రశ్నలు వేస్తావు. నీ 50th బర్త్డే అని కొన్నాను. అంత కంగారు పడే విషయమేమి కాదు." అని హుటీ గ జవాబిచ్చింది అక్షర.
"సరే లోపలికి పద ముందు. మొహం కడుక్కుని కాఫీ తాగుదుగాని ", అని చెప్తూ తన ట్రాలీ బాగ్ ని తీస్కుని లోపలి వచ్చారు తల్లీ కూతుర్లిద్దరూ .
లోపలికి వస్తున్న అక్షరని చూసి వాళ్ళ నాన్న, నాయనమ్మ కూడా వచ్చి గారాబంగా కౌగిలించుకొని క్షేమసమాచారాలు కనుక్కున్నారు.
కాసేపటికి కాఫీ గ్లాస్ పట్టుకుని అక్షర రూమ్ లోకి వెళ్లారు జయశ్రీ. కాఫీ గ్లాస్ చేతికందించి, "అసలు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? అంతా బాగానే ఉందా? " అని ఆరాతీసారు .
మెల్లగా చేతిలో ఉన్న కాఫీ ని ఆస్వాదిస్తూ, "నీ కాఫీని మిస్ అయ్యాను, అందుకే వచ్చానమ్మా" అని చెప్పింది నవ్వుతూ.
"అబ్బా, వేళాకోళం వద్దు. అసలు విషయం చెప్పు. నీకు అస్సలు బస్సులో ప్రయాణం అంటేనే ఇష్టముండదు, అలాంటిది నువ్వు నాన్ - ఏసీ బస్సెక్కి వచ్చావంటే నాకేంటో అనుమానంగా ఉంది ".
ఇంక అమ్మ వేస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే అని అర్ధమయ్యి, కాఫీ గ్లాస్ పక్కన పెట్టి, అసలు విషయం చెప్పింది అక్షర.
"మొన్న వరుణ్ తో చిన్న ఆర్గుమెంట్ అయ్యింది" అని చెప్పింది సీరియస్ గ చూస్తూ.
"దేనిగురించి?" అని కంగారుగ అడిగారు జయశ్రీ .
"అబ్బా, అంత పెద్ద విషయమేంకాదమ్మా . ఏదో చిన్న misunderstanding అంతే." అని కొట్టిపడేసింది అక్షర.
"అంత చిన్న విషయమయితే నువ్వెందుకు అంత దిగులుగా ఇంటికి వచ్చేసావ్?"
"అంటే ఏంటిప్పుడు? నేను ఇంటికి రాకూడదా?
"అలా అనట్లేదు నేను. చిన్న గొడవ అయితే ఇలా సడన్ గ ఇంటికి రావుకదా, విషయం మొత్తం సరిగ్గా చెప్పమ్మా. నాకు అసలే కంగారుగా ఉంది"
కాబోయే అల్లుడికి, కూతురికి ఎం మనస్పర్థలు వచ్చాయో ఏంటో అని జయశ్రీ చాలా కంగారు పడ్డారు.
ఇంకో రెండు నెలల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అపార్ధాలు, అలగడాలు అంటే పెళ్లి పీటల వరకు వెళ్లకుండా ఆగిపోతుందేమో అని భయం.
"ఏమి లేదమ్మా. వాళ్ళ అక్క అమెరికా లో ఉంటుందని నీకు తెలుసు కదా. ఆమెతో రెగ్యులర్ గ మాట్లాడు, టచ్ లో ఉండు అని అన్నాడు వరుణ్. దానికి నేను ఆమెతో రోజు మాట్లాడడానికి ఎం ఉంటుంది అని అన్నాను. అందులో తప్పేంటి? ఎక్కడో అమెరికా లో ఉంది. పెళ్లయ్యాక నాక్కూడా బోల్డు పనులు ఉంటాయి. వాళ్లందరికీ ఫోన్లు చేస్కుంటూ కూర్చోలేనుగా? "
ఇదంతా విని ముందు ఊపిరి పీల్చుకున్నారు జయశ్రీ. ఆమె భయపడినంత పెద్ద విషయమేమి కాదు కానీ వదిలేసేంత చిన్న విషయం కూడా కాదు.
"చూడు అక్షర. నువ్వు చెప్పేది నాకు అర్ధమవుతోంది. కానీ, వరుణ్ చెప్పినదాన్లో తప్పేమి లేదు."
"నాకు తెలుసు, నువ్వు నాదే తప్పు అని అంటావని. అందుకే అసలు నీకు చెప్పకూడదని అనుకున్న", అని కోపంగా దిండుని విసిరేసింది అక్షర.
"నేను తప్పు నీది అని అనలేదు. ఆ అబ్బాయి చెప్పింది తప్పు కాదు అని మాత్రమే అన్నాను. రెండిటిలో ఉన్న డిఫరెన్స్ అర్ధం చేస్కో. వరుణ్ మంచి కుటుంబంలో పెరిగిన అబ్బాయి. వాళ్ళందరూ చాలా కలివిడిగా, ఆప్యాయంగా ఉంటారు. తనకి వాళ్ళ అక్కతో చాలా మంచి రేలషన్ ఉంది. ఆమె పెళ్ళయ్యి అమెరికా వెళ్ళిపోయినా, తనతో ఆ చనువు, ఆ అభిమానం ఏమాత్రం తగ్గిపోకుండా, ఒక తమ్ముడిలా, ఒక స్నేహితుడిలా, తన తోబుట్టువుతో ఎలా ఉండాలో చక్కగా తెలుసుకుని ఎంతో మధురమైన, నాజూకైన ఆ బంధాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు.
పెళ్లయ్యాక నువ్వు తనకి అర్ధాంగివి, తన జీవితంలో అన్నిటిలోను సగం భాద్యత నీకు ఉంటుంది. బంధాలయిన, భాద్యతలైనా , ఇద్దరు సమానంగా ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండాలి. అది పెళ్లి అంటే , దాంపత్యం అంటే.
మీ జనరేషన్ కి పెళ్లి అంటే, ప్రీ-వెడ్డింగ్, పోస్ట్-వెడ్డింగ్ ఫోటో షూట్స్, హల్దీ, మెహేంది ఫంక్షన్స్, థీమ్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్లు, కామెంట్లు..ఇవన్నీ.
కానీ ఇవన్నీ ప్రపంచానికి చూపించుకోవడానికి చేసే ఆర్భాటం మాత్రమే.
అసలు పెళ్లి అంటే అబ్బాయికి అమ్మాయికి అయ్యే ఒక తంతు కాదు.
రెండు కుటుంబాల కలయిక. ఈ తరానికి, రాబోయే తరాలకు అండగా ఉంటూ, వాళ్ళ భవిష్యత్తు బాగుండేలా , పక్కనే ఉంటూ ఆ పిల్లలను కాపాడుకునే బాధ్యతను రెండు కుటుంబాలవారు, సమానంగా పంచుకుని ముందుకు సాగే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మీ ఇద్దరే కాదు, మీ చుట్టూ ఉన్న అందరూ ముఖ్యమే.
అసలు తోబుట్టువులు ఎందుకు ఉన్నారు? మన జీవితంలో ఎలాంటి కష్టమైన , సుఖమైనా పంచుకోవడానికి ఒకరు ఉండాలి. తల్లిదండ్రులు చివరివరకు మనతో ఉండకపోవచ్చు, కానీ మన తోబుట్టువు మనతో ఉంటారు. వరుణ్ వాళ్ళ అక్క అంటే తనకి మాత్రమే కాదు, ఆమెతో నీకు కూడా ఒక బంధం ఏర్పడుతుంది."
"నేను కాదనటంలేదమ్మా. అదంతా సరే, కానీ వాళ్ళ అమ్మకి, అక్కకి ప్రతీ వారం ఫోన్ చెయ్యాలి అన్న expectation కరెక్టా?"
"అది expectation అని నువ్వు అంటున్నావు. అది రిలేషన్ బిల్డింగ్ అని నేను అంటున్నాను. ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడకూడదు?"
"ఫ్రెండ్స్ వేరు ఫామిలీ వేరు కదా? ఆ రెండు ఒకటి ఎలా అవుతాయి?"
"ఇదంతా మీ ఆలోచనావిధానంలో ఉందమ్మా. ఫామిలీ లో వాళ్ళు ఫ్రెండ్స్ లా ఉండకూడదా? నేను, మీ నాన్న నీతో ఫ్రెండ్స్ లా ఉండటంలేదా?"
"మీరు వేరు, వాళ్ళు వేరు కదా?"
"కాదు. ఆ థింకింగ్ ఏ మార్చుకోవాలి. పెళ్లి అయ్యాక, వాళ్ళు కూడా నీ ఫామిలీనే . వాళ్ళతో నీ రిలేషన్ ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ అవ్వాలి, ఆ రిలేషన్ని అలా మలుచుకోవాలి. మొదటి నుండి ఆప్యాయంగా మాట్లాడితే, అత్తగారైన, ఆడపడుచైనా నిన్ను వాళ్ళ సొంత పిల్లలాగానే చూసుకుంటారు. అయినా తప్పు నీది కాదమ్మా. ఈ సమాజానిది. అత్తగారు, ఆడపడుచు అంటే శత్రువులు అన్నట్టు చూపించే సీరియల్స్, సినిమాలు, పనిలేక చాడీలు చెప్పే వాళ్లది తప్పంతా. అవన్నీ చూస్తూ, వింటూ పెరిగినవాళ్ళు ఇలానే ఆలోచిస్తారులే. ఈ ఆలోచనా విధానం మారాలి. ఎవరికి తెలుసు, వరుణ్ వాళ్ళ అక్క నీకు బాగా నచ్చి, తనే నీ బెస్ట్ ఫ్రెండ్ గా మారచ్చు. నువ్వు వరుణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటావు అన్నది మీ ఇద్దరి వైవాహిక సంబంధానికి చాలా కీలకమైనది. పెళ్లి అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంత మార్పు తెస్తుందో, ఒక అబ్బాయి జీవితంలోకూడా అంతే మార్పు తెస్తుంది. తన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముడ్లు, ఇలా ఇంట్లో ఉన్న ప్రతీ మనిషితో తన భార్య ఎలా మసులుకుంటుంది అన్నదానిమీద తన జీవితం ఆధారపడుతుందని అనచ్చు. ఇంట్లో సుఖశాంతులు ఉంటేనే మనసు సంతోషంగా ఉంటుంది, మన జీవితాన్ని పంచుకుంటున్న వారితో ప్రేమానురాగాలతో ఉండగలుగుతాం."
"hmm .. నువ్వు చెప్పేదాన్నో చాలా sense ఉందమ్మా. నేను అస్సలు ఇలా ఆలోచించలేదు. పెళ్లయ్యాక ఎం ఉంది, నేను వరుణ్ కలిసి బెంగుళూరులో మా మట్టుకుమేము ఉంటాము అంతే కదా? అని అనుకున్న. కానీ అది చాలా తప్పని అర్ధమయ్యింది. నాకు నా అమ్మ, నాన్న, నానమ్మ అందరూ ఎలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నానో, తను కూడా అలానే అనుకుంటాడుకదా. How didn't I realise that? " అని కళ్ళంట నీరుపెట్టుకుంది.
తన ఆలోచన ఎంత తప్పుగా ఉందో తెలుసుకుని భాదపడుతున్న కూతురిని దగ్గరకు తీస్కుని, వొళ్ళో తన తలను పెట్టుకుని, తల నిమురుతూ, "తప్పు చెయ్యడం మానవ సహజం, కానీ మన తప్పును మనం తెలుసుకుని, సరిదిద్దుకోగలగడం గొప్పతనం. నువ్వు నా బంగారు తల్లివి. నీకు చాలా maturity ఉంది. నీమీద మా అందరికి చాలా నమ్మకముంది, నువ్వు ఎం చేసినా ఆలోచించి చేస్తావని. అందుకే నీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా నీకే వదిలేసాము. కానీ నువ్వు ఎక్కడా ఎలాంటి తప్పు చెయ్యకుండా , నీ వెనక కాపాడుకుంటూ మేము ఉంటాము. నీకేం భయంలేదు. వెళ్ళి వరుణ్ తో మాట్లాడు. మీ మధ్య ఏర్పడిన అపార్ధాన్ని నువ్వే తొలగించాలి".
అమ్మ చెప్పిన మాటలు విన్నాకా మనసు ఏంతో తేలికపడినట్టు అనిపించింది అక్షరకి.
"Happy Birthday Amma" అంటూ జయశ్రీ బుగ్గమీద గట్టిగా ఒక ముద్దు పెట్టి కౌగిలించుకుంది.
బంధాలు - అనుబంధాలు
